రాత్రి తొమ్మిది దాటినా, తన భర్త శంకర్రావు భోజనానికి డాబా పైనుంచి రాకపొయేసరికి తానే మెట్లెక్కి డాబాపైకి వెళ్లింది మీనాక్షి. డాబాపై ఓమూల పిట్టగోడపై కూర్చొని సిగరెట్ కాలుస్తూ తదేకంగా దేని గురించో ఆలోచిస్తోన్న భర్త దగ్గరికి వెళ్లింది.
"తొమ్మిది దాటింది. అయినా, మీకింకా భోజనం విషయం గుర్తుకు రాలేదా ఏమిటి? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?"
భార్య పలుకులతో తన తదేక ఆలోచనలను మానుకొని చిన్నగా ఓ నిట్టూర్పు విడిచి ఏమీ లేదన్నట్లు తలాడించి "పద" అంటూ భార్యవెంట మెట్లు దిగి ఇంట్లోకి వెళ్లాడు.
భోజనాలయ్యాక భర్త వంక చూస్తూ మళ్లా అడిగింది మీనాక్షి.
"దేని గురించండి! అంతగా ఆలోచిస్తున్నారు? నాతో చెప్పకూడని విషయమా?"
"నీ దగ్గర చెప్పకూడని రహస్యాలు ఏముంటాయి?" డైనింగ్ టేబుల్‌కు పక్కనే కాస్త దూరంలో వున్న సోఫాసెట్‌పై కూర్చుంటూ.
"మరి ఏమిటి విషయం?" వెళ్లి భర్త పక్కనే కూర్చుని వక్కపలుకు అందిస్తూ అంది మీనాక్షి.
వక్కనములుతూ అన్నాడు శంకర్రావు. "ఒక్కోమారు మనిషి తన జీవితం గురించి, ఈ సమాజం గురించి ఆలోచిస్తే ఏవేవో పిచ్చిపిచ్చి ఆలోచనలు బుర్రలో రేగుతాయి. ఏదో తెలియని అశాంతి మనసులో బయల్దేరుతుంది".
"అసలు విషయం చెప్పమంటే, ఈ ఉపోద్ఘాతం దేనికి?" కాస్త చికాగ్గా పలికింది మీనాక్షి. భార్య చిరాకును గమనించిన శంకర్రావు పెదాలపై మందహాసం! భార్యతో తన మస్తిష్కంలో చెలరేగిన ఆలోచనలు ఏమిటో చెప్పక తప్పదనిపించింది.
"నేను రోజూలాగే ఈ రోజు సాయంకాలం నా లాంటి రిటయిర్డ్ ఎంప్లాయీస్‌తో కాలక్షేపం చేయడానికి పార్క్‌కు వెళ్లాను. అప్పటికింకా ఎవరూ రాలేదు. రోజూ వచ్చే ఆ సాయంకాలపు మిత్రులకోసం ఎదురు చూస్తూ వుండగా, అనుకోకుండా చిన్నగా చినుకులు పడ్డాయి. పార్క్‌లోనే వున్న మీటింగ్ హాల్ వరండాలోకి వెళ్లి నిల్చున్నాను. అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చొని మాట్లాడుకొంటూ వున్నారు. వారికి కొద్ది దూరంలో నిలబడ్డాను. వారిద్దరి మధ్యా జరుగుతోన్న సంభాషణ నా చెవిన పడింది. నాలో ఆసక్తి రేగి వారికి మరికాస్త దగ్గరగా వెళ్లి నిలబడ్డాను. వారెవరో నాకు తెలియదు. ఇద్దరి వయసు 35,40ల మధ్య వుంటుంది.
ఆ ఇద్దరిలో ఒకతను ఇలా చెప్పుకొచ్చాడు.
"నువ్వెంతయినా చెప్పరా! ఈ సమాజం మారదు. మారని ఈ సమాజం గురించి, మారని ఈ మనుషుల గురించి మనం ఆలోచించి బుర్ర పాడు చేసుకోవలసిందే కాని, ఎలాంటి ప్రయోజనం వుండదు. నలుగురూ ఎలా బతుకుతున్నారో మనమూ అలాగే బతకాలి. సమాజసేవ, ఆదర్శాలు అంటూ ఆచరించే ప్రయత్నం చేస్తే మనం కోరి కష్టాలను తెచ్చుకోవటమే కాదు, నలుగురిలో నవ్వులపాలు కూడా అవుతాం! చివరికి ఏమీలేని వాళ్లుగా మిగిలిపోతాం! ఆదర్శాలూ, సమాజసేవ అన్నది పుస్తకాల్లో చదువుకోవడానిక్, టివీలో, సినిమాలో చూడటానికి బాగుంటుంది. నిజ జీవితపు ఆచరణలో చాల కష్టం. అందులో మధ్యతరగతి వారికి మరీ కష్టం! బతుకు భారమై మానవసంబంధాలన్నీ ఆర్థిక బంధాలైన ఈ రోజుల్లో అసలు అలాంటి ఆలోచనలే అనవసరం! ఏలాగైనా నాలుగు డబ్బులు కూడేసుకొని సుఖంగా జీవించాలేకాని కూడు పెట్టని ఆదర్శాల వెంట పరుగులు తీస్తే బొక్కబోర్లా పడతాం! అప్పుడు అందరూ నవ్వే వారేకానీ అయ్యో పాపం!అని జాలితో పైకి లేపే వారే వుండరు. సో... ఆదర్శాలు ... సమాజ సేవ వంటి పదాలు నీ బుర్రలో నుంచి తుడిచేసుకో! అందరిలాగే జీవించడానికి ప్రయత్నించు. ఏమంటావు?"
ఈ మాటలకు ఇంకో అతను ఇలా చెప్పుకొచ్చాడు.
"రేయ్! నీ ఆలోచనా విధానంలోనే లోపముంది. నువ్వూ, నీలాంటివారు సమాజం గురించి, వ్యక్తులగురించి అవగాహన చేసుకొన్న తీరులో లోపముంది. మనిషి తనకు తానుగా బ్రతుకుతూ, తన పరిధి మేరా ఇతరులకు ఎలా సాయపడగలను అని ఆలోచించాలి. అంతేకాని పూర్తిగా ఇతరులకోసమే జీవించాలని నేను చెప్పడం లేదు. ప్రతీ మనిషీ ఇలాంటి దృక్పథం విధిగా అలవర్చుకోవాలి. చదువు రాని వారి విషయం వదిలేయ్! విద్యావంతులైన మనలాంటి వారు, ఉద్యోగస్థులు, లాయర్లు, అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపరస్థులు, విద్య నేర్చి ఏదో ఒక రంగంలో కృషి చేస్తున్నవారు, వివిధ వృత్తులు చేపట్టిన వారు, మేధావి వర్గం అని పిలువబడే వారు ఈ విధమైన ఆలోచనా ధోరణిని అలవరుచుకోవాలి. అంతేకాని కేవలం 'నా ఇల్లు, నా వాళ్లు, వాళ్ల బాగోగులే జీవితం' అన్న పంథాలో జీవించరాదు. 'నేను ఏ సమాజం నుంచయితే తిండి, బట్ట సంపాదించుకో గలుగుతున్నానో, అలాంటి సమాజానికి నా వంతు బాధ్యతగా ఎంతో కొంత మంచి చేసి చావాలి' అన్న ఆలోచనా సరళి కలిగి వుండాలి. అప్పుడే మనం నేర్చిన విద్యకు, వ్యక్తిగా మన జీవితానికి ఓ ప్రయోజనం చేకూరుతుంది. మనిషి తన పరిథిలోనే ఇతరులకు సాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాకపోతే, ఎవరికి వారు, తమకేమీ పట్టనట్లుగా మార్గాలగురించి ఆలోచించటం లేదంతే! విద్యావంతులు, మేథావి వర్గంగా పిలువబడుతున్నవారే తమకేమీ పట్టనట్లుగా కేవలం తమ స్వార్థానికే ప్రాధాన్యత ఇస్తూ పోతే, చివరికి సమాజంలో మంచి అన్నది కరువై, ఎటుచూసినా అశాంతి ప్రబలి అది విధ్వంసక ధోరణికి దారితీస్తుంది. సమాజాన్ని ఓ విషవలయంగా మార్చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నదదే!" చెప్పటం ఆపి భార్యవంక చూశాడు శంకర్రావు.
"ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నారండీ!" ఆసక్తిగా అడిగింది మీనాక్షి.
"చినుకులు పడ్డం ఆగిపోవడంతో, వారెందుకో సీరియస్‌గా తమ డిస్కషన్ ఆపు చేసుకొని వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక, రెండో వ్యక్తి చెప్పిన మాటలు నన్నెందుకో బాగా కదిలించి వేశాయి. అతని మాటల్లో చాలా సత్యముందనిపించింది.'ప్రతి మనిషి తాను చనిపోయేలోపు ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేసి చావాలి' అన్న అతని మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. పార్క్ నుంచి వచ్చానన్న మాటేగాని, నా ఆలోచనలన్నీ ఈ మాటల చుట్టే పరిభ్రమిస్తూ వున్నాయి."
"డూ సమ్‌థింగ్... బిఫోర్ లీవ్ ద వరల్డ్" అనిపిస్తోంది అన్నాడు శంకర్రావు.
"అలా అనిపించడం మంచిదే! మీరూ ఏదైనా ఓ మంచి పని చేయండి" అంది మీనాక్షి సన్నటి నవ్వుతో తన భర్త వంక చూస్తూ.
"అదే ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే నావల్ల కనీసం ఓ అయిదారు మందికయినా మంచి జరిగినట్లుగా వుంటుంది అంటావు?" భార్యకేసి చూస్తూ అడిగాడు శంకర్రావు?" భార్యకేసి చూస్తూ అడిగాడు శంకర్రావు.
"ఎంతో కొంత మొత్తాన్ని ఏ అనాథ శరణాలయానికో, ఏ ఛారిటబుల్ ట్రస్టుకో ఇవ్వండి! అలా ఇవ్వటం కూడా మంచి చేసినట్టే కదా!" అంది మీనాక్షి.
"అలా ఇవ్వటం కాదోయ్. నాకు నేనుగా ఏదో చేయాలనుంది" చెప్పాడు శంకర్రావు.
"అలా అయితే మీరే ఆలోచించుకోండి! నాకేమీ తట్టడం లేదు. నే వెళ్లి పక్క సర్దుతాను" అంటూ సోఫాపై నుంచి లేచి బెడ్‌రూమ్ వైపు నడిచింది మీనాక్షి.
శంకర్రావు మళ్లీ దీర్ఘాలోచనలో పడ్డాడు.
ఓ రోజు తన మనసులోని ఆలోచనను, సాయంకాలాలు పార్కులో కలిసే సాయంకాలపు మిత్రులతో చెప్పాడు శంకర్రావు. ఓ మారు అందరూ అతనివంక అదోలా చూసి నవ్వి తలో విధంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి అందరి వ్యాఖ్యానాల సారాంశం ఒక్కటే!
"రిటయిర్డ్‌మెంట్ లైఫ్‌ను హాయిగా ఎంజాయ్ చేయక, ఎందుకండీ ఆ అలోచనలు? వొదిలెయ్యండి! ఇలా సాయంకాలాలు పార్క్‌కొచ్చి కాలక్షేపం చేసి వెళ్లండి! ఇక్కడికి రావడం కూడా బోర్అనిపిస్తే, మీ మిసెస్‌ను తీసుకెళ్లి అలా బజార్లు తిరిగిరండి! ఏదైనా షాపింగ్ చేయండి! లేదా సినిమాకెళ్లండి! లేదా మీరప్పుడప్పుడూ టూరిస్ట్ ప్లేస్‌లకు పుణ్యక్షేత్రాలకు మీ భార్యతో కలిసి వెళుతుంటారుకదా! అలా మళ్లీ వెళ్లి రండి! లేదా హైదరాబాద్‌లో వున్న మీ అబ్బాయి దగ్గరికి వెళ్లి వుండండి! మనవడితో, మనవరాలితో కాలక్షేపం చేయండి!ఈ వయసులో అలాంటి ఆలోచనలు పెట్టుకొంటే వొంటికి ప్రయాస. లేని ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్లవుతుంది. మనం ఏదైనా ఒక పని చేస్తే స్వప్రయోజనం వుండాలి. కానీ, వృథాగా ఎవరికోసమో కష్టపడరాదు. అలా కష్టపడ్డం ఒక విధంగా ఫూలిష్‌నెస్ అవుతుందే కానీ మరొకటి కాదు., మీరు చెప్పే విషయాలు మాకు తెలియకనా? వాటిలో దూరితే అంతన్నదే వుండదు... ఏదో వున్నన్ని రోజులూ హాయిగా కాలక్షేపం చేసిన్ అవకాశం వుంటే, ఎక్కడ్నుంచయినా, ఎలాగయినా కొంత డబ్బు సంపాదించి పోగేసి పిల్లలకిచ్చి చావాలి కాని, సమాజం చట్టుబండలు అంటూ పాకులాడరాదు." శంకర్రావు మౌనం వహించాడు. చర్చ రాజకీయాలపైకి మళ్లింది.
కొన్నాళ్లు గడిచాయి...
శంకర్రావు మదిలోని ఆలోచనలు చెదరిపోలేదు కాని, ఆ ఆలోచనల తాలూకు ఉద్వేగం మాత్రం తగ్గింది... అలాంటి తరుణంలో... దూరపు బంధువుల పెళ్లికని విజయవాడకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రైల్లో వచ్చి, స్టేషన్ నుంచి బయటకొచ్చాక, అర్థాంగితోబాటు ఆటో ఎక్కాక ఆటో కదిలి వెళ్తూ వుండగా... అతని భార్యే అంది.
"అటు చూడండి! ఆ ఫుట్‌పాత్‌పై కొంతమంది ఎలా చలికి వణికిపోతూ పడుకున్నారో, కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. చిరిగిపోయిన వాళ్ల బట్టలు, మురికి పట్టి వున్న వాళ్ల శరీరాలు... తైల సంస్కారం లేని వారి జుత్తు... ఎండుకుపోయిన ఆ డొక్కలు...ఆ డొక్కల్లోకే కాళ్లు ముడుచుకుని ఎలా పడుకొని వున్నారో! ఫుట్‌పాత్‌పై ఇలాంటి వారిని చూసినప్పుడల్లా మనసుకు ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఎందుకు వీరి జీవితాలు ఇలా ఫుట్‌పాత్‌ల పాలవుతున్నాయి? అనిపిస్తోంది."
"ఒకవైపు దారిద్ర్యం, మరోవైపు జీవితంపై విరక్తి ప్రధానంగా ఈ రెండు కారణాలే కొందరి జీవితాలను ఫుట్‌పాత్‌పైకి చేరుస్తున్నాయి" చెప్పుకొచ్చాడు శంకర్రావు.
"మీరేదో మంచిపని చేయాలనుకుంటున్నారే, ఆ చేసే మంచేదో ఇలాంటి వారికి చేయరాదూ?" అంది మీనాక్షి.
"వీరికి నేనేం చేయగలను?" ఆలోచనకు తెరతీస్తున్నాడు శంకర్రావు.
"ఆలోచిస్తే ఏదో ఒక మార్గం తోచకపోదు."
భార్య మాటలకు శంకర్రావు మస్తిష్కంలో అణగారివున్నా ఆలోచనలు ఒక్కమారుగా ఉవ్వెత్తున పైకిలేచి ఉద్విగ్నతను సంతరింప చేసుకున్నాయి. ఆటోలో ఇల్లు చేరాక ప్రయాణపు బడలికతో ఇరువురు పక్కపై వాలిపోయారు. మీనాక్షి నిదురలోకి జారుకుంది. శంకర్రావుకి అలసటగా వున్నా, నిద్రపట్టలేదు. బెడ్‌రూంలో నుంచి హాల్లోకి వచ్చి సోఫాసెట్‌పై కూర్చుని సిగరెట్ వెలిగించాడు.
* * * * *
ఓ వారం రోజుల తీవ్రమైన మథన తర్వాత శంకర్రావుకు తాను వారికి చేయగలిగే సాయం ఏమిటో బుర్రకు తట్టింది. భార్యను పిలిచి చెప్పాడు.
"ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాను."
"అద్దెకా! ఎందుకు?" అడిగింది మీనాక్షి.
"ఓ అద్దె ఇల్లు తీసుకుని, ఫుట్‌పాత్‌పైని వ్యక్తుల్లో కాళ్లు, చేతులు తమ స్వాధైనంలో వుండి బాగా తిరుగాడే వారిలో ఓ అయిదారు మందిని ఎంపిక చేసుకుని అందులో వుంచాలనుకుంటున్నాను."
"ఆ వుంచి" భర్తవంక చూస్తూ సరదాగా నవ్వి అంది మీనాక్షి.
"వారికి కిరాణా కొట్లో, పచారి సరుకులు కట్టే కాగితపు సంచుల తయారీలో, అప్పడాల తయారీలో ఓ నెలపాటు ఎవరితో అయినా శిక్షణ ఇప్పించాలనుకుంటున్నాను."
"ఆ ఇప్పించాక..."
"వారు తయారు చేసిన వాటిని దుకాణాలకు వెంట వుండి వారితోనే వేయించాలి. కాస్త పికప్ అయ్యాక, వారే స్వయంగా మార్కెట్ చేసుకొంటారు. వారి ఖర్చుల మేర సంపాదన వాటి అమ్మకాల ద్వారా సంపాదించుకుంటారు. వారికి జీవితంపై మళ్లీ ఓ కొత్త ఆశ చిగురిస్తుంది. తమపై తమకు నమ్మకం విశ్వాసం ఏర్పడతాయి."
"ఆలోచన బాగానే వుంది. వారంతట వారు ఇంటి అద్దె, తమ తిండి, కరెంటు ఖర్చు సంపాదించుకోవాలటే ఎంత టైం పడుతుంది? అప్పటిదాకా వారికోసం ఎంత పెట్టుబడి పెట్టాలో ఆలోచించారా? " అంది మీనాక్షి.
భార్య అడిగిందానికి ఇలా సమాధానం చెప్పుకొచ్చాడు శంకర్రావు.
"ఇంటి అద్దె వెయ్యిరూపాయలు. అడ్వాన్సుగా రెండు వేలు ఇవ్వాలి. ఓ అయిదు మందిని తెచ్చామనుకో! వారికి తలా రెండు జతల బట్టలు, అంటే పది జతల బట్టలు, అయిదు తుండ్లు, రెండేసి చొప్పున లోదుస్తులు. పడుకోవడానికి ఒక్కొక్కరికి ఒక చాప చొప్పున అయిదు చాపలు. వీటన్నిటికీ కలిపి ఓ నాలుగు వేలదాకా రావచ్చు. ఓనెల లేదా రెణ్ణెళ్లు అంకో, కాగితాల సంచుల తయారీని, అప్పడాల తయారీని నేర్పేవారికి నెలకు ఓ వెయ్యి చొప్పున రెండువేల రూపాయలు. నెలకు సరిపడ ముడిసరుకులకు, వాటి తయారీకి సంబంధించిన వస్తువుల కొనుగోలుకు మరో మూడు వేల రూపాయలు. ఇక ఓ అయిదారుమందికి తిండికి ఖర్చు నెలకు రెండువేలదాకా అవుతుంది. కరెంటు ఖర్చు ఓ అయిదువందలు. సుమారు పధ్నాల్గు,పదిహేను వేలదాకా ఖర్చొస్తుంది మొదటినెల. రెండో నెలనుంచి ఆ ఖర్చు తగ్గుతూ వెళ్తుంది."
"ఎంత తగ్గుతూ వెళ్లినా, రెండొనెల నుంచి ఈజీగా అయిదారు వేల దాకా ఖర్చొస్తుంది.వారి అప్పడాలు, కాగితపు సంచులు తయారీ అయి, అవి మార్కెట్ అయి తిరుగు డబ్బు రావడానికి కనీసం ఓ నెల పడుతుంది. ఏ కొట్టువాడూ వెంటనే తీసుకొని డబ్బివ్వడు కదా! కాస్త గడువు పెడతాడు" అంది మీనాక్షి.
"కాగితాల సంచులకు గడువు వుండదు. వెంటనే ఇచ్చేస్తారు. ఎందుకంటే నిత్యం వాటితో వారికి అవసరం కదా!" చెప్పాడు శంకర్రావు.
"వెంటనే ఇచ్చినా అంత పెద్దమొత్తంగా ఏమీ రాదు. అప్పడాలపై ఆదాయమే కాస్త గిట్టుబాటుగా వుంటుంది. వాటిపై ఆదాయం రావాలంటే, వాటికి కాస్త పేరొచ్చి, బాగా అమ్ముడు పోవడానికి కనీసం ఓ మూడు నాలుగు నెలలు పడుతుంది. ...అంతా మొత్తంగా మనం వారికోసం ఓ ముప్పైవేల దాకా ఖర్చు పెట్టాల్సి వుంటుంది" భర్తవంక చూస్తూ అంది మీనాక్షి.
"ఓ మంచి పని చేయాలనుకున్నప్పుడు ముప్పయి వేలకు వెనకాడితే ఎలా? బ్యాంక్‌లో ఎంతో కొంత డబ్బుంది. అందులో నుంచి తీసి ఖర్చుపెడదాం! మరీ అవసరం అనుకుంటే నా పెన్షన్‌పై లోను తీసుకుంటాను. ఏమంటావు?" భార్య వంక చూస్తూ అడిగాడు శంకర్రావు.
మీనాక్షి మౌనం వహించింది.
"నీకిష్టం లేకపోతే చేయను. ఎందుకంటే, నీ సహకారం కూడా ఇందులో ఎంతో కొంత కావాలి. వారికి వంట రాకపోయి వుంటే, వారంతట వారు వంట నేర్చుకొనే వరకు నువ్వు సాయం చేయవలసి వుంటుంది. ఇతరత్రా కూడా నీ అండ వారికవసరం. మన కాలనీలో నీకు తెలిసిన ఇళ్లకు వెళ్లు. ప్రతి నెలా వీరి అప్పడాలు కొనుగోలు చేసేలా కన్విన్స్ చేయాలి.నేను నా సర్కిల్‌కు చెబుతాను. ఏమంటావు? ఇదంతా నీ సమ్మతమయితేనే... వద్దంటే మౌనంగా వుండిపోతాను."
భర్త మాటలకు మీనాక్షికి నవ్వు పుట్టుకొచ్చింది. ఇక మౌనంగా వుండలేక పోయింది. చిన్నగా నవ్వేసింది. శంకర్రావు కూడా చిన్నగా నవ్వుతూ "నాకు తెలుసు, నీకూ ఇష్టమే అని... కాకపోతే... నీ అంగీకారంతో ఈ కార్యం మొదలు పెట్టాలన్నది నా ఆలోచన. ఏమంటావు?"
"నేనేమంటాను, మీరు మంచి పని చేస్తుంటే. అందుకు అభ్యంతరం చెప్పక ఆ మంచిలో పాలుపంచుకోవటం మీ భార్యగా నా బాధ్యత అనుకొంటాను"అంది మీనాక్షి. 'థాంక్స్' అన్నట్టుగా భార్యవంక చూశాడు శంకర్రావు. మరోమారు సన్నగా నవ్వింది మీనాక్షి.
* * * * *
మూడు నెలలు గడిచిపోయాయి.
అనుకొన్న ప్రకారంగానే, భార్య సహకారంతో ఫుట్‌పాత్‌పై వుంటున్న వ్యక్తుల్లోనుంచి ఓ అయిదు మందిని తెచ్చి అద్దె ఇంట్లో వుంచి వారికి కాగితపు సంచుల తయారీలో, అప్పడాల తయారీలో శిక్షణ ఇప్పించాడు. రోజుకో వ్యక్తిని వెంటబెట్టుకొని ఒక్కో ఏరియాకు వెళ్లి తయారు చేసిన వాటిని కిరాణం షాపుల్లో వేయిస్తూ, షాపుల వారమ్మింది తీసుకుంటూ, వారంత వారుగా బతకడానికి సరిపడ ఆదాయం ఇంకా రాకున్నా, నెలకు తన చేతినుంచే నాలుగైదు వేలు ఖర్చు పెడుతూ వస్తూ వున్నాడు శంకర్రావు. ఇంకో మూడు నెలలకు కానీ, తాను ఆశించిన స్థాయిలో ఆదాయం వారికి రాదని తెలిసినా.
ఓ రోజు ఫుట్‌పాత్‌పైనుంచి తెచ్చిన వ్యక్తుల్లో నుంచి ఓ వ్యక్తిని వెంటబెట్టుకొని దుకాణాలకు సరుకు వేయడానికి వెళ్తుండగా, రామారావు అనే మిత్రుడు అతనికి ఎదురుపడ్డాడు. అతనూ రిటయిర్డ్ ఆఫీసరే! పార్క్‌లో సాయంకాలపు కాలక్షేపం మిత్రుడే! అతను శంకర్రావు వంక ఎగాదిగా చూస్తూ చెప్పాడు.
"ఏంటయ్యా ఇది? ఆఫీసర్ హోదాలో రిటయిర్డ్ అయ్యావు. నువ్విలా అప్పడాల సంచిని పట్టుకొని షాపుల వెంట వెళ్తూ వుంటే నాకు ఏదోలా వుంది. మన మిత్రులు కూడా నీవు చేస్తున్న ఈ పని గురించి విని ఫీలయ్యారు... సొసైటీలో నీ డిగ్నిటీ ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించు."
"ఒకరి జాలి, ఫీలింగ్ నాకవసరం లేదు. ఎవరెలా అనుకొన్నా, నవ్వుకొన్నా నేను పట్టించుకోను. ఇక డిగ్నిటీ మాటంటారా; అది వ్యక్తి దృష్టిని బట్టి వుంటుంది. 'ఇస్త్రీ బట్టలు నలగ కుండా వుండాలి- అలా వుండటమే డిగ్నిటీ' అనుకొనేవారికి నేనేం చెప్పలేను. ఇంతకాలం నేను కూడా ఈ సమాజంలో పుట్టినందుకు, సమాజపు రుణం తీర్చుకోవడంలో ఆలస్యం చేశాను. ఆ ఆలస్యాన్ని ఇప్పటికైనా గ్రహించి, నా రుణం తీర్చుకోనే ప్రయత్నం చేస్తున్నాను. మీరుకూడా మీ అవకాశాలను బట్టి, ఈ సమాజం రుణం తీర్చుకొనే ప్రయత్నం చేయండి! వస్తాను" అంటూ ఎదురుగా వుండే కిరాన షాపుల వైపు నడిచాడు శంకర్రావు తన వెంట వున్న వ్యక్తిని తీసుకొని.
"ప్రతి మనిషికీ వేపకాయంత వెర్రి వుంటుంది అంటారు పెద్దలు. ఇదోరకం వెర్రి.ఇలాంటి వెర్రి పుట్టరాదు. పుడితే, పుడకలదాకా పోదు" అని మనసులో చిన్నగా నవ్వుకొంటూ కాలక్షేపం కోసం పార్క్‌వైపు అడుగులు వేశాడు రామారావు.
ఒకరి నడకలో 'సమాజం రుణాన్ని తీర్చుకోవాలి' అన్న తపన వుంటే, మరొకరి నడకలో 'ఆ రుణాన్ని ఎలా ఎగ్గొట్టాలి'అన్న ఆలోచనా ధోరణి దాగి వుంది.
[నవ్య వీక్లీ 12-10-2005 సంచికలో ప్రచురితం]
No comments:
Post a Comment